Heavy rain alert to Andhra Pradesh: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. రెండు రోజుల నుంచి ఏకధాటి వర్షం పడుతోంది. వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో ఉమ్మడి విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేయాలని సీఎం ఆదేశించారు. వర్షాలపై అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వాగులు, వంకలు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా మ్యాన్ హోల్, కరెంట్ తీగలు విషయంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు.