మూడు రోజుల్లోనే ఛేదించిన పోలీసులు
ప్రతిపక్షం ప్రతినిధి, ములుగు
తాడ్వాయి మండలంలోని నాంపల్లి గ్రామ శివారులో నీళ్ల ఒర్రె వద్ద అంగన్వాడీ టీచర్ పైన జరిగిన అత్యాచారం మరియు మర్డర్ కేసును మూడు రోజుల్లో ఛేదించిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
శుక్రవారం కాటాపూర్ క్రాస్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా మోటార్ సైకిల్ పై తాడ్వాయి వైపు నుండి వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు పట్టుకుని విచారించగా ఏటూరునాగారం మండలంరొయ్యుర్ కు చెందిన ఆకుదారి రామయ్య, పగిడి జంపయ్యలగా గుర్తించారు . వీరి వద్ద నుండి బైక్, బంగారం, పుస్తెలు, మృతురాలి హ్యాండ్ బ్యాగ్, బ్యాంక్ పాస్ బుక్, ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ జరిగింది…
ఈ నెల 14న విధులు ముగించుకొన్న అంగన్వాడీ టీచర్ సుజాత తిరిగి చిన్నబోయినపల్లి లోని తన ఇంటికి వెళ్లడం కోసం బస్ స్టాండ్ కి వచ్చింది. బస్ మిస్ అవడంతో అంతకుముందే పరిచయం ఉన్న ఆకుదారి రామయ్య , ఈమెను కాటాపూర్ నుండి లిఫ్ట్ ఇవ్వడం కోసం బైక్ ఎక్కించుకున్నాడు. అప్పటికే ఆకుదారి రామయ్య నీళ్ల ఒర్రె వద్ద పగిడి జంపయ్య ని దించాడు. రామయ్య నీళ్ల ఒర్రె వద్దకు సుజాతను తీసుకెళ్లాడు. అక్కడ ఆకుదారి రామయ్య, పగిడి జంపయ్య లు ఇద్దరూ ఆమెను అడవిలో కొద్దీ దూరం తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆమె మెడలోని బంగారు గోపి తాడును లాక్కునే ప్రయత్నం చేయగా ఆమె ప్రతిఘటించడంతో పగిడి జంపయ్య ఆమె తలపై రాయితో కొట్టాడు. ఆకుదారి రామయ్య ఆమె ఛాతిపై కూర్చొని గొంతు నొక్కగా, తర్వాత ఇద్దరూ కలిసి ఆమె స్కార్ఫ్ తో మెడ చుట్టూ చుట్టి ఇద్దరూ ఒక్కో వైపు నుండి లాగి ఊపిరాడకుండా చేసి చంపారు. తర్వాత ఆమె మెడలోని 3 తులాల రెండు వరసల గోపి తాడు, పుస్తెలను తీసుకోని,
ఆమె మొబైల్ ఫోన్స్ ని పక్కనే ఉన్న నీళ్ల ఒర్రె లో పడేసి ఆమె బ్యాగ్ ని అడవి వైపు దూరంగా విసిరేసి రొయ్యుర్ గ్రామం వెళ్లిపోయారు. తదనంతరం మృతురాలి కొడుకు రడం చరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తాడ్వాయి పోలీసులు విచారణ చేపట్టి పస్రా సిఐ వంగపల్లి శంకర్, తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి ల ఆధ్వర్యంలో 2 బృందాలుగా ఏర్పడి సీసీ ఫుటేజీల ఆధారంగా, వారి కాల్ డేటా ఆధారంగా పూర్తి ఆధారాలు సేకరించి నిందితులను పట్టుకున్నారు.