పారిస్‌లోని డిలా కాంకార్డ్ వేదికగా మరో క్రీడోత్సవానికి తెర లేచింది. 2024 పారాలింపిక్స్ క్రీడలు పారిస్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. క్రీడల ప్రారంభ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు పీటర్ పావెల్, జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్‌మీర్‌లతో పాటు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. మార్షల్ ఆర్ట్స్ లెజెండ్, ప్రముఖ నటుడు జాకీ చాన్ పారాలింపిక్స్ టార్చ్ బేరర్‌గా వ్యవహరించి సందడి చేశారు.
మొత్తం 11 రోజుల పాటు సాగే పారాలింపిక్స్‌లో 168 దేశాలకు చెందిన మొత్తం 4,400 క్రీడాకారులు పాల్గొంటున్నారు. భారత్ తరఫున 84 మంది అథ్లెట్లు బరిలో ఈసారి నిలిచారు. ఇంత మందితో పారాలింపిక్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. గతంలో టోక్యోలో జరిగిన పోటీల్లో భారత్ 5 స్వర్ణాలు సహా 19 పతకాలు సాధించి పాయింట్ల పట్టికలో 24 స్థానంలో నిలిచింది. ఈసారి మొత్తం 50 పతకాలకు పైగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు క్రీడారంగ నిపుణులు చెబుతున్నారు. ఇక, ఈ క్రీడలు సెప్టెంబర్ 8న ముగుస్తాయి.