నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి ) ఏప్రిల్ 16 : నిర్మల్ బాసర ట్రిపుల్ ఐటీ ఆర్జీకేయుటీ లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అరవింద్ కుమార్ అనే విద్యార్థి వసతి గృహంలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. మృతుడి స్వస్థలం సిద్ధిపేట జిల్లా బండారుపల్లి గ్రామంగా గుర్తించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. సమాచారం అందుకున్న స్థానిక జిల్లా స్థాయి పోలీసులు బాసర ట్రిపుల్ ఐటీ కి చేరుకొని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
కదిలిన విద్యార్థి సంఘాలు..
బాసర ట్రిపుల్ ఐటీ సముదాయంలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారాన్ని తెలుసుకున్న జిల్లాలోని వివిధ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన చెందాయి. వెంటనే బాసర ట్రిపుల్ ఐటీ కి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు వారిని అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. నిర్మల్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో విద్యార్థి మృతదేహం ఉండగా.. అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఆందోళనలు చేపట్టకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు.