ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియకు మరో 15 రోజుల గడువును పొడిగించింది. వచ్చే నెల 15వ తేదీ వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఈ బదిలీల గడువు ఆగస్టు 31తో ముగియాల్సి ఉంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని సర్కార్ ప్రకటించింది. అయితే పలు శాఖల్లో బదిలీలపై ప్రక్రియ అనుకున్నంత వేగంగా ముందుకు సాగటం లేదు. వీటిలో కీలకమైన రిజిస్ట్రేషన్ శాఖ కూడా ఉంది. మరో కీలకమైన శాఖలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు చాలా శాఖల్లో బదిలీల ప్రక్రియ రేపటితో పూర్తి కానుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో… ఈ గడువును 15 రోజులపాటు పెంచుతూ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది.