హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిసీ గురుకుల డిగ్రీ, కాలేజీల్లో సీటు కోసం విద్యార్థినీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి బి. సైదులు , ఐఎఫ్ ఎస్ గారు ప్రకటించారు. ఏప్రిల్ 28న పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు ప్రవే శాలను కల్పిస్తామని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 28 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని, ఏప్రిల్ 12 తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 గురుకుల డిగ్రీ కాలేజీలు ఉన్నాయని, ఇందులో అమ్మాయిల కోసం 15, అబ్బాయిల కోసం 14 కాలేజీలు అందుబాటులో ఉన్నాయని, ప్రవేశ పరీక్ష ద్వారా ఈ విద్యా సంవత్సరం 9120 సీట్లను భర్తీ చేస్తామన్నారు. గురుకుల డిగ్రీ కాలేజీల్లో రెగ్యులర్ కోర్సులతో పాటు మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ టెక్నాలజీ, న్యూట్రిషన్ ఫుడ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్ టైల్ టెక్నాలజీ, బీబీఏ, బీకాం కంప్యూటర్స్, ఎంపీసీఎస్, ఎంఎస్సీ ఎస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు గమనించాలని ఆయన పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షలు రాసిన బిసీ విద్యార్థులు డిగ్రీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
261 గురుకుల ఇంటర్ కళాశాలల్లో 21,920 సీట్లు..
తెలంగాణలో బీసీలకు మొత్తంగా 261 గురుకుల జూనియర్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీలు మినహా మిగిలిన 255 గురుకుల కాలేజీల్లో ప్రవేశ పరీక్ష ద్వారా 21,920 సీట్లకు అడ్మి షన్లను లభిస్తాయని ఎంజెపి కార్యదర్శి సైదులు పేర్కొన్నారు. బీసీ ఇంటర్ కాలేజీల్లో 130 బాలుర కాలేజీల్లో 11360 సీట్లు , 125 బాలికల కళాశాలలు 10560 సీట్లు అందుబాటులో ఉన్నాయని, మెరుగైన విద్య, భోజన వసతి సదుపాయాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇంటర్మీడియట్ లో రెగ్యులర్ కోర్సులతో పాటు ప్రొఫెషనల్ కోర్సులు అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్, అకౌంటింగ్, ట్యాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, హోమ్ సైన్స్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 255 బీసీ జూనియర్ కళాశాలలతో పాటు 29 గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు నోటిఫికేషన్ జారీ చేశామని, విద్యా ర్థులు ఆన్లైన్ https://mjptbcwreis.telangana.gov.in/contact ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 040- 23828266 నంబర్లో సంప్రదించాలని సైదులు సూచించారు.