భారీ వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా భీకరంగా కురుస్తున్న వర్షాలతో రెండు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక గ్రామాలు, పట్టణాలు జలదిగ్భందనం చిక్కుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు అంధకారంలో ఉన్నారు. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశించి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘తెలుగు రాష్ట్రాల్లో వరదల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే.. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటారు. ఇప్పుడు కూడా అదే విధంగా అభిమానులంతా అండగా నిలుస్తారని.. అవసరమైన వారికి చేయూత అందిస్తారని ఆశిస్తున్నా’ అని చిరంజీవి తెలిపారు.