నెట్టింట్లో వీడియో వైరల్..
ప్రతిపక్షం, స్టేట్బ్యూరో హైదరాబాద్, ఏప్రిల్4: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఓ వర్గం ప్రజల ఓట్లనే అభ్యర్థిస్తూ ఎన్నికల్లో గెలుస్తున్న ఎంఐఎం పార్టీ సైతం హిందువుల ఓట్లపై ప్రత్యేక నజర్ పెట్టింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన శనివారం నాడు మూసారాంబాగ్‌లో కలియ తిరిగారు. స్థానికులతో మాట్లాడుతూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతుండగా ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఆయన తన పర్యటనలో భాగంగా ఆంజనేయ స్వామి గుడి పక్క నుంచి వెళ్తున్నారు. అప్పటికే గుమిగూడిన ఎంఎంఐ కార్యకర్తలు అసద్‌ని ఆశీర్వదించాలని ఆంజనేయ స్వామి ఆలయ పూజారిని కోరారు. అసద్ కూడా అర్చకుడి ఆశీర్వాదం కోసం ముందుకు వచ్చారు. అనంతరం పూజారి.. అసద్ మెడలో పూలమాల వేసి, శాలువా కప్పి సన్మానించి ఆశీర్వదించారు. అనంతరం అసద్ అర్చకులందరితో కలిసి ఫొటో దిగారు. సదరు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసద్ ఎన్నికల ప్రచారానికి వెళ్లి.. మత సామరస్యాన్ని చాటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.