-కురిక్యాల హెచ్ఎం సస్పెన్షన్
టీచర్లు, సిబ్బంది అంతా బదిలీ
జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఉత్తర్వులు జారీ
అటెండర్ అరెస్ట్, రిమాండ్ : సీపీ గౌస్ ఆలం
ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్, అక్టోబర్ 28: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ యాకుబ్ పాషా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో సంఘటనను ఉన్నతాధికారులకు నివేదించడం, వాస్తవాలు దాచడం, నిర్లక్ష్యం కారణంగా జడ్పీహెచ్ఎస్ కురిక్యాల గ్రేడ్-2 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు టీ.కమలను విధులనుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ యాకూబ్ పాషా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో వెంటనే జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముగ్గురు సభ్యుల అధికారుల బృందాన్ని విచారణకు ఆదేశించారు. విచారించిన బృందం తమ నివేదికను జిల్లా కలెక్టర్ కు సమర్పించింది. ప్రధానోపాధ్యాయురాలు కమల జరిగిన సంఘటనను దాచిపెట్టాల్సిందిగా పాఠశాల సిబ్బందిని బెదిరించారని, విద్యార్థుల భద్రతను ఆమె విస్మరించారని, జరిగిన సంఘటనను ఉన్నతాధికారులకు తెలియజేయకుండా వాస్తవాలు దాచారని విచారణ కమిటీ తమ నివేదికలో వెల్లడించింది. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టీ.కమలను విధులనుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు అమలులో ఉన్నంతకాలం ప్రధానోపాధ్యాయురాలు కమల ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ వదిలి వెళ్లరాదని ఆదేశించారు. ఈ ఘటనలో ఆఫీస్ సబార్డినేట్ యాకూబ్ పాషా ఇదివరకే సస్పెన్షన్ అయిన విషయం తెలిసిందే.
అటెండర్ అరెస్ట్, రిమాండ్: సీపీ గౌస్ ఆలం
కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఆఫీస్ అటెండర్ గా పనిచేస్తున్న మహ్మద్ యాకూబ్ పాషా, కురిక్యాల గ్రామం, గంగాధర మండలంలో కొన్ని రోజులుగా పాఠశాలలో చదువుతున్న మైనర్ విద్యార్ధినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, వేధింపులకు గురి చేస్తున్నాడనే ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని రిమాండ్ చేయడం జరిగిందని కరీంనగర్ సీసీ గౌస్ ఆలం తెలిపారు. సీపీ మాట్లాడుతూ పాఠశాల సెలబ్రేషన్స్ రోజున విద్యార్ధినులతో ఫొటోలు దిగగా, వాటిని మార్ఫింగ్ చేశానని బెదిరించి, పోస్ట్ చేశాడని ఫిర్యాదులు అందాయి. కురిక్యాల పాఠశాల ప్రధానోపాద్యాయురాలు గంగాధర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. బీఎన్‌ఎస్, పోక్సో, ఐటి చట్టాల్లోని కఠినమైన సెక్షన్లలో కేసు నమోదు చేయడ జరిగిందని సీపీ తెలిపారు. పాఠశాలలో చదువుతున్న కొందరు విద్యార్థినులపై లైంగిక దాడి చేసినట్లు ఏసీపీ విజయ్ కుమార్ విచారణలో కూడా నిర్దారణ అయిందన్నారు. నిందితుడు మహ్మద్ యాకూబ్ పాషాను కరీంనగర్ లోని రేకుర్తి చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని వైద్య పరీక్షల అనంతరం, కోర్టులో హజరు పర్చగా, జ్యుడీషియల్ రిమాండ్ విధించడం జరిగిందన్నారు. మైనర్ అమ్మాయిలు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఏసీపీ విజయ్ కుమార్ హెచ్చరించారు. పాఠశాల, కళాశాలలో చదివే విద్యార్ధినులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసే మహిళలు వేధింపులు, లైంగిక దాడులకు గురయినట్లయితే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడతాయని ఈ సందర్భంగా వెల్లడించారు.





























