నిలువు దోపిడి చేస్తున్న వక్ఫ్ సిబ్బంది
ప్రతి పక్షం, జుక్కల్ ప్రతినిధి, మే 14: బడాపహాడ్ లో కోరికలు నెరవేరగానే మొక్కులు చెల్లించుకుందామని వచ్చిన భక్తులు వక్ఫ్ సిబ్బంది చేసే నిలువు దోపిడీతో గజగజ వణికి పోతున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం లోని బడాపహాడ్ సయ్యద్ షాదుల్లా హుస్సేనీ దర్గా వద్ద వక్ఫ్ సిబ్బంది దోపిడీతో భక్తులు హడలెత్తిపోతున్నారు. వక్ఫ్ బోర్డు అదీనంలొని ఈ దర్గా వద్దకు ప్రతినిత్యం వేలాదిమంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. అత్యంత ప్రాచీనమైన ఈ దర్గాకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. తలనీలాలను సమర్పించడం, మేకలను బలిఇవ్వడం, ఒంటె, గుర్రం రూపాలతో తయారు చేసిన వెండి బంగారు వస్తువులను సమర్పించడం ద్వారా తమ మొక్కులు తీర్చుకుంటారు.
భక్తులలోని అమాయకత్వాన్ని, భక్తి భావాన్ని వక్ఫ్ సిబ్బంది తమకు అనుకూలంగా మార్చుకుని దోపిడీకి తెగబడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తప్పనిసరి పరిస్థితుల్లో వక్ఫ్ సిబ్బంది డిమాండ్ చేసినంత సోమ్ము ముట్టచెప్పక తప్పడం లేదు. ప్రతి శుక్ర వారం, ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు పూజ కోసం దర్గా లో ప్రవేశించగానే సిబ్బంది దోపిడీపర్వం ప్రారంభమవుతుంది. మొక్కు తీర్చుకోవడానికి తీసుకు వచ్చిన పూజాసామాగ్రిని వక్ఫ్ సిబ్బంది తమ చేతులలోకి తీసుకుంటారు. రూ. 1,500 నుంచి రూ. 2000 వరకు హుండీలో వేయ వలసిందిగా డిమాండ్ మొదలవుతుంది. భక్తులు తీసుకు వచ్చిన సామాగ్రి లోని వెండి, బంగారం తో చేసిన వస్తువులను హుండీలో వేయనీకుండా సిబ్బంది చేతి లోకి తీసుకుంటున్నారు.
హుండీలో వేయ వలిసిన అభరణాలు వక్ఫ్ సిబ్బంది జేబు లోకి వెళ్ళి పోతున్నాయి. మొక్కు తీర్చుకుంటే ఇవ్వవలసిన మొత్తం కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారు. భక్తులు హుండీలో వేసే సొమ్మును సైతం తమ చేతిలోకి లాక్కొని జేబులలో వేసుకుంటున్నారు. భక్తులు సిబ్బంది చెప్పిన మొత్తం ఇవ్వక పోతే మొక్కు తీర్చనీయ కుండా అడ్డుకుంటున్నారు. దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో సిబ్బంది డిమాండ్ చేసిన మొత్తం భక్తులు ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వక్ఫ్ సిబ్బందినీ ప్రశ్నిస్తే గంటల తరబడి నిలబెడుతున్నారు.
వసూళ్లు మా ఇష్టం అంటున్న వక్ఫ్ సిబ్బంది. భక్తుల వేసే కానుకలు హుండీలో కాకుండా చేతిలోకి తీసుకోవడంపై వక్ఫ్ సిబ్బంది సమాధానం పలు అనుమానాలకు దారితీస్తుంది.. ప్రస్తుతం దర్గా కాంట్రాక్ట్ కాలపరిమితి ముగియడంతో వక్ఫ్ సిబ్బంది ఆధీనంలో ఉంది. సూపర్డెంట్, డిప్యూటీ సూపర్డెంట్ దర్గా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. సిబ్బంది వ్యవహార శైలికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. హుండీలో వేయాల్సిన కానుకలపై ఎవరైనా ప్రశ్నిస్తే మా ఇష్టం అనే సమాధానం సిబ్బంది నుంచి వస్తుంది. శుక్రవారం, ఆది వారాలలో ప్రతిరోజు లక్ష రూపాయలకు పైగా సిబ్బంది తమ జేబుల్లో వేసుకుంటున్నారు. ఫలితంగా వక్ఫ్ బోర్డు ఖజానాకు భారీ ఎత్తున గండి పడుతుంది. భక్తులు దూర ప్రాంతాల నుంచి రావడంతో సిబ్బందితో వివాదాలకు దిగకుండా అడిగిన మొత్తాన్ని ఇవ్వాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది.