ప్రతిపక్షం, కరీంనగర్, ఏప్రిల్ 27: రుణమాఫీపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల తీరుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారు. 6 గ్యారంటీల అమలుపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇరు పార్టీల నేతల డ్రామాలాడుతూ మీడియాలో బ్రేకింగ్‌ల కోసం యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు బండి సవాల్ విసిరారు. ‘వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు. అయినా వాటిని అమలు చేసినట్లు పచ్చి అబద్దాలాడుతున్నారు. నేను మీకు సవాల్ చేస్తున్నా.. వాటిని అమలు చేసినట్లు నిరూపిస్తే నేను ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటా. అవసరమైతే కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధమే. నిరూపించకపోతే కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న17 మంది అభ్యర్థులు ఎన్నికల బరి నుండి తప్పుకునేందుకు సిద్ధమా?’’అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు తన సవాల్ ను స్వీకరించి డేట్, టైం, వేదిక నిర్ణయిస్తే.. వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు.
ఈ రోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కోడూరు మహేందర్ గౌడ్ తోపాటు తెలంగాణ ఉద్యమకారులు కుమార్ తదితరులు తమ అనుచరులతో కలిసి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా వారందరికీ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయా నేతలతోపాటు మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, వాసాల రమేశ్ లతో కలిసి మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. ఇప్పుడేమో 6 గ్యారంటీలను అమలు చేశామని అబద్దాలాడుతున్నరు. రుజువు చేస్తే నేను పోటీ నుండి తప్పుకునేందుకు నేను సిద్ధం. మీరు నిరూపించకుంటే 17 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులంతా పోటీ నుండి తప్పుకుంటారా? ఈ సవాల్ కు స్వీకరించే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా? అభ్యర్థుల ఉప సంహరణకు ఎల్లుండి చివరి తేదీ. ఆలోపు నిరూపిస్తే నేను పోటీ నుండి తప్పుకుంటా.. ఎన్నికల్లోపు నిరూపించినా సరే.. నేనే స్వయంగా కాంగ్రెస్ అభ్యర్ది తరపున ప్రచారం చేస్తా.. దమ్ముంటే నా సవాల్ కు స్పందించాలి.. మీకు నిజంగా బైబిల్, ఖురాన్, భగవద్గీత మాదిరిగా మేనిఫెస్టో పవిత్రమైనదైతే.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే నా సవాల్‌ను స్వీకరించాలి. ప్రజల ముందు ఆధారాలతోసహా నిరూపించాలి. డేట్, టైం, వేదిక మీరే డిసైడ్ చేయండి. అమర వీరుల స్థూపం వద్దకైనా వస్తా.. సర్దార్ పటేల్ విగ్రహం వద్దకైనా.. భాగ్యనగర్ అమ్మవారి ఆలయం వద్దకైనా సరే.. ఎక్కడికైనా వచ్చేందుకు నేను సిద్ధమని సవాల్ విసిరారు.