ప్రతిపక్షం, కరీంనగర్: బండి సంజయ్ ను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే.. మోదీ కేబినెట్ లో మంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్ధి రఘునందన్ రావు అన్నారు. రాష్ట్రంలో ఎదురే లేదని విర్రవీగుతున్న బీఆర్ఎస్ ను కూడా ఓడించవచ్చని నిరూపించి.. వచ్చిన తొలి ఎన్నిక దుబ్బాక అని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో తాను అభ్యర్ధిగా నిలబడితే పోరాడి గెలిపించిన నాయకుడు బండి సంజయ్ అని పేర్కొన్నారు. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో.. కేంద్రంలో మళ్లీ నరేంద్రమోదీ ప్రధాని కావడం అంతే నిజమని అన్నారు. రఘునందన్ రావును మెదక్ బీజేపీ అభ్యర్ధిగా ప్రకటించిన నేపథ్యంలో చొప్పదండి నియోజకవర్గంలోని బోయినిపల్లి మండలంలో ప్రజాహిత యాత్ర చేస్తున్న బండి సంజయ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బోయినిపల్లి మండల కేంద్రంలో భారీ ఎత్తున ప్రజలు తరలిరావడంతో బండి సంజయ్ తో కలిసి రఘునందన్ రావు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధిగా బండి సంజయ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ దేశానికి దిక్సూచి మోదీ అని కొనియాడారు. కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సిన్ అందించి దేశ ప్రజల ప్రాణాలను కాపాడారన్నారు.