Bangladesh TV journalist found dead in Dhaka lake: బంగ్లాదేశ్‌లో ఓ మహిళా టీవీ జర్నలిస్ట్ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఢాకాలోని హతిర్ జీల్ సరస్సులో టీవీ జర్నలిస్ట్ సారా రహ్మునా(32) మృత దేహం లభ్యమైంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఢాకా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో సరస్సులో దూకినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఆమెది ఆత్మహత్య లేదా హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. సారా రహ్మునా గాజీ టీవీలో న్యూస్ రూేమ్ ఎడిటర్ గా పనిచేస్తోంది. అయితే ఆమె చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘నీలాంటి స్నేహితుడు ఉండడం ఆనందంగా ఉంది. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ చల్లగా చూస్తాడు. త్వరలో నీ కలలు నెరవేరుతాయి. మన జీవితం కోసం కలిసి చాలా ప్లాన్ చేసుకున్నామని తెలుసు. కానీ వాటిని నెరవేర్చలేకపోతున్నందుకు నన్ను క్షమించు.’ అని రాసుకొచ్చింది. అంతకుముందు పోస్టులో ‘చావుతో సమానమైన జీవితాన్ని గడపడం కంటే చనిపోవడం ఉత్తమం.’ అని రాసి ఉంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.