ప్రియాంక అపాయింట్మెంట్ కోరిన బీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు భారీ షాక్ తగలబోతోందా. అంటే అవుననే సంకేతాలు ఇస్తున్నాయి తాజా పరిణామాలు. పార్టీకి ఎంతో నమ్మిన బంటుగా ఉండే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ని మల్లారెడ్డి, మరో నేత మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం కలిసినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఓ హోటళ్లో డీకే శివకుమార్‌తో మంతనాలు జరిపారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఇరువురు దాదాపు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోరారు. దీన్ని బట్టి అతి త్వరలోనే మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.