బుగ్గారం జడ్పీటీసీ, ఎంపీపీ లు పార్టీకి రాజీనామా..
ప్రతిపక్షం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కి చెందిన బుగ్గారం జడ్పీటీసీ బాతినేని రాజేందర్, ఎంపీపీ రాజమణి లు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తాము బీఆర్ఎస్ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వారు తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రారంభం నుండి కేసీఅర్ గెలవాలని, తెలంగాణ వాదం నిలవాలని బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంతో కృషి చేశామని అన్నారు. తెలంగాణ సాధన కోసం చేసిన పోరాటంలో తమ వంతు పాత్ర పోషించినట్టు గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆయా సందర్భాలలో ఇచ్చిన పిలుపుల మేరకు అన్ని రకాల కార్యక్రమాల్లో పాలు పంచుకున్నామని, కానీ పార్టీ తమను అణిచివేతకు గురి చేసి చిన్న చూపు చూసిందని ఆవేదన వ్యక్తంచేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు అండగా నిలిచి ఆయన గెలుపు కోసం కృషి చేశామని తెలిపారు. ఈశ్వర్ కూడా చిన్న చూపు చూసినట్లు అనిపించిందని.. త్వరలో భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తామని వారు తెలిపారు.