ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి: నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ కు నేతలు షాక్ ఇస్తూనే ఉన్నారు. పదేళ్లపాటు రాష్ట్రంలో చక్రం తిప్పిన బీఆర్ఎస్ కు లోక సభ ఎన్నికల సమయంలో తలనొప్పిగా మారింది. ఇప్పటికే నిర్మల్ మున్సిపల్ ఇద్దరు కౌన్సిలర్ లు, మామడ మండల వైస్ ఎంపీపీ, పార్టీ అధ్యక్షులు తాజా మాజీ సర్పంచ్ లు రాజీనామా చేసి నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా.. నిర్మల్ ఎంపీపీ కోరిపల్లి రామేశ్వర్ రెడ్డి, నిర్మల్ జిల్లా గ్రంథాలయాల చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, నిర్మల్ మున్సిపల్ కౌన్సిలర్ లు నేరెళ్ల వేణు, సమందర్ పెల్లి రాజులు శనివారం హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కార్యక్రమాలకు ఆకర్షితులై తాము కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వారం రోజులుగా పలు దఫాల చర్చలు జరిపి నాయకులు, కార్యకర్తల నిర్ణయాల మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని స్పష్టం చేశారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ నిర్మల్ యువజన నాయకులు సయ్యద్ అర్జుమంద్ తదితరులు ఉన్నారు.
సీతక్క ఆధ్వర్యంలో పలువురి కాంగ్రెస్ లో చేరిక..?
శనివారం మధ్యాహ్నం నిర్మల్ లో జరగనున్న ఆదిలాబాద్ పార్లమెంటరీ స్థాయి నాయకులు, కార్యకర్తల సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కూడా పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు ప్రణాళిక రూపొందించుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం.