బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి, నిర్మల్, జూలై 02 : ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని బీజేఎల్పీ నేత నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలో జరిగిన ‘వన మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని మొక్కలు నాటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాతావరణంలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని లక్షలాదిగా మొక్కలు నాటే కార్యక్రమాలను కోట్లాది రూపాయలు వెచ్చించి తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామాలు వీధులలో బాధ్యతగా ప్రతి ఒకరు తమ పూర్వీకుల పేరిట కనీసం ఐదు మొక్కలను నాటాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల పట్ల అన్ని వర్గాలకు కనీస అవగాహన ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాలలో సుస్థిర పాలనను అందించేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రణాళిక బద్ధమైన రీతిలో ముందుకెళ్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అదనపు లోకల్ బాడీ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, ఆయా శాఖల అధికారులు, రాజకీయ పార్టీల పదాధికారులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.