బీజేఎల్పీపీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 1 : పదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ సుస్థిర పాలనను చూసి తిరిగి బీజేపీకే ఓటు వేయాలని బీజేఎల్పీపీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఆలూరు, ధని, నిర్మల్ మండలంలోని వెంగ్వాపేట గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. పదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో మోడీ దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లి ప్రపంచంలోనే ఆదర్శ దేశంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఎలాంటి అవినీతి అక్రమాలు మోసాలు లేకుండా “సబ్కా సాత్ సబ్కా వికాస్” నినాదంతో కేంద్రంలో పదేళ్లపాటు పరిపాలనను సాగించిన నరేంద్ర మోడీనే మూడోసారి ప్రధానిగా చేసుకుందామని చెప్పారు. అదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడెం నగేష్ కు పార్లమెంట్ సెగ్మెంట్ పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉందని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా సుపరిచితుడైన గోడం నగేష్ కే ఓటు వేసి గెలిపించుకుందామన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్నమైన సంక్షేమ పథకాలు కార్యక్రమాల ద్వారా దేశంలోని అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ల కుమ్మక్కై బీజేపీ నాయకులపై లేనిపోని ఫేక్ ప్రచారాలు సోషల్ మీడియాలో చేయడం శోచనీయమని పేర్కొన్నారు. దేశమంతా బీజేపీ మూడోసారి కూడా జెండా ఎగర వేసే దిశగా వేగంగా ముందుకెళ్తున్నదన్నారు. అదే దిశలో మనం కూడా బీజేపీ జెండాను ఎగరవేద్దామన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు పూర్తిస్థాయి మౌలిక వసతులను కల్పించడంతోపాటు వారి డిమాండ్లను నెరవేర్చిన ఘనత కూడా ప్రధాని నరేంద్ర మోడీదేనని చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ ఎన్నికల ప్రచార పత్రాలను ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఆయన వెంట వి. సత్యనారాయణ గౌడ్, మొహమ్మద్ జమాల్ తదితరులు పాల్గొన్నారు.