ప్రతిపక్షం, హుస్నాబాద్, జూన్ 5: కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా బీజేపీ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ రెండోసారి రెండు లక్షలపైగా మెజార్టీతో గెలుపొందడంతో బుధవారం రోజున నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్ పట్టణంతో సహా నియోజకవర్గ అన్ని మండల కేంద్రాల్లో బీజేపీ శ్రేణులు ర్యాలీలు తీస్తూ మిఠాయిలు పంచుకొని తినిపిస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరీంనగర్ రోడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బీజేపీ శ్రేణులు ర్యాలీ ప్రారంభించి అక్కన్నపేట చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగించారు. అనంతరం టపాకులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాం గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ రెండవసారి గెలుపొందడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై కార్యక్రమాలు చేపడతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ఒత్తిడీలు ప్రలోభాలకు గురిచేసిన ఓటర్లు బండి సంజయ్ కి ఓటు వేసి గెలిపించారని అన్నారు. ఈ సందర్భంగా ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. కోహెడ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం ఆధ్వర్యంలో స్వీట్లు పంచుతూ గెలుపు సంబరాలు జరుపుకున్నారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు చేరువయ్యే విధంగా వివిధ కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. అక్కన్నపేట మండల కేంద్రములో గిరిజన మోర్చా నాయకుడు బానోతు అనిల్ నాయక్ ఆధ్వర్యంలో బండి సంజయ్ గెలువడంతో గిరిజన నాయకులతో స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు లక్కీరెడ్డి, తిరుమల బత్తుల శంకర్ బాబు, గాదాసు రాంప్రసాద్, అనంత స్వామి తోట స్వరూప, సమ్మయ్య, వీర నాయక్, పిల్లి నరసయ్య, గుగ్గిళ్ళ శ్రీనివాస్, మేకల రజినీకాంత్, కొండబత్తిని సతీష్ తదితరులు పాల్గొన్నారు.