“తిండి పెట్టకుండా కొట్టి ఇంటి నుంచి వెళ్లగొడుతోంది”
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ , సెప్టెంబర్ 22: కోడలు తిండి పెట్టకుండా కొట్టి ఇంటి నుంచి వెళ్లగొడుతోందంటూ తొనిగండ్ల గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు పోచమ్మ–నారాయణ కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు.“కొడుకు ఏడేళ్ల క్రితమే చనిపోయాడు.. వయసై నడవలేని పరిస్థితిలో ఉన్న మమ్మల్ని ఎవరు ఆదుకోవాలి?” అంటూ అధికారుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.కుమారుడు మల్లేశం మృతి అనంతరం కోడలు అరుణ, మనవళ్ల వద్ద ఉంటున్నామని తెలిపారు.ప్రస్తుతం సేవ చేయలేమంటూ తమపై దాడి చేసి ఇంటి నుంచి వెళ్లగొడుతోందని వారు ఆరోపించారు.తల్లిదండ్రులను కుమార్తెలు భూలక్ష్మి, అనసూయ కొంతకాలం తమ వద్ద ఉంచుకున్నారని తెలిపారు.
నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి తీసుకెళ్లగా మళ్లీ తిండి పెట్టకుండా బయటకు పంపించిందని వాపోయారు.
తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు.వృద్ధ దంపతుల ఫిర్యాదుపై సీనియర్ సిటిజన్ ఫోరం అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిపారు.




























