ప్రతిపక్షం, జూన్ 25: తనపై కొందరు చేసే విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరంగా స్పందించారు. ఉద్యోగుల బీమా రక్షణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, తనను కొందరు గుంపు మేస్త్రీ అని విమర్శిస్తుంటారని, అయితే ఆ పేరును తాను గర్వంగా స్వీకరిస్తానని అన్నారు.
“అవును.. నేను గుంపు మేస్త్రీనే. మంత్రులు, అధికారులు, ఉద్యోగుల బృందానికి మేస్త్రీని. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు చేరేలా పనిచేసేది ఈ బృందమే” అని పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
కొంతమంది తాము దొరలమని, తమకు పెద్ద పెద్ద గడీలు ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటారని విమర్శించిన రేవంత్ రెడ్డి, తనకు అలాంటి హోదాలు, ఆడంబరాలు అవసరం లేదన్నారు. ప్రజల మధ్య సాధారణ వ్యక్తిగా ఉండటానికే తాను ఇష్టపడతానని చెప్పారు.
తాను ఏ పదవిలో ఉన్నా ప్రజలు ప్రేమతో “రేవంతన్న” అని పిలిస్తేనే ఆనందంగా ఉంటుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రజలకు చేరువగా ఉండే నాయకత్వమే తనకు ముఖ్యమని, సేవాభావంతో పని చేయడమే తన లక్ష్యమని తెలిపారు.
ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు సభలో ఉన్న ఉద్యోగులను ఆకట్టుకోగా, రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి.

















