Hydra Notices to CM brother Thirupati Reddy: హైడ్రా దూకుడు పెంచింది. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజాగా, మాదాపూర్‌లోని అమర్ కో ఆపరేటివ్ సొసైటీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు బఫర్ జోన్‌లో ఉందని, నెలరోజుల్లో కూల్చాలని రెవెన్యూ అధికారులు నోటీసులు అంటించారు. ఈ నోటీసులపై తిరుపతిరెడ్డి స్పందించారు.
2015లో అమర్ సొసైటీలో ఇల్లు కొనుగోలు చేశానని, అయితే ఈ ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుందన్న సమాచారం తెలియదన్నారు. నాకు ఇల్లు అమ్మిన వ్యక్తి అన్ని అనుమతులతోనే ఇంటిని నిర్మించారని, కానీ బఫర్ జోన్‌లో ఉందని నాకు ముందే చెప్పలేదన్నారు. ఇప్పుడు బఫర్ జోన్‌లో ఉందని నోటీసులు వచ్చాయని, ఒకవేళ నేను ఉంటున్న ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే ప్రభుత్వం, హైడ్రా చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదన్నారు.
నిబంధనల మేరకు ఎఫ్‌టీఎల్ పరిధిలో కూల్చేయవచ్చని చెప్పారు. అయితే కొంత సమయం ఇవ్వండని, ఆ సమయంలో ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతామన్నారు. ఇదిలా ఉండగా, దుర్గం చెరువు పరిధిలో ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. ఇందులో ఐఏఎస్, ఐఆర్ఎస్, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉన్నాయి.



























