Trending Now

ప్రమాదంలో వార్తా పత్రికలు


యాజమాన్యాల ధోరణి మారాలి
అప్పుడే పూర్వ వైభవం వస్తుంది
పత్రికలలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి
‘డిజిటల్’ యుగంలో తప్పుడు వార్తల వ్యాప్తి
‘మన తెలంగాణ’ సంపాదకులు దేవులపల్లి అమర్
అంబేడ్కర్ వర్సిటీలో ప్రొ. బషీరుద్దీన్ స్మారకోపన్యాసం

(ప్రతిపక్షం స్టేట్ బ్యూరో)
హైదరాబాద్, ఫిబ్రవరి 6: డిజిటల్ మీడియా వినియోగం పెరగడంతో ప్రింట్ మీడియా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని సీనియర్ పాత్రికేయులు, ‘మన తెలంగాణ’ దిన పత్రిక సంపాదకులు దేవులపల్లి అమర్ అన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ. ఎస్. బషీరుద్దీన్ 89వ జయంతిని పురస్కరించుకుని అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆయన గురువారం నాడు స్మారకోపన్యాసం చేశారు. ముందుగా ప్రొ. బషీరుద్దీన్ చిత్ర పటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ‘ప్రింట్ మీడియా – సంక్షోభం, భవిష్యత్’ అనే అంశంపై ప్రసంగించారు. ప్రస్తుత పరిస్థితులలో డిజిటల్ మీడియా వినియోగం, ఎలక్ట్రానిక్ మీడియా ఉపయోగం బాగా పెరిగిందని, దీంతో వార్తా పత్రికల సర్క్యులేషన్, ప్రకటనల ఆదాయం తగ్గి అనేక ప్రఖ్యాత పత్రికా సంస్థలు నిలదొక్కుకోవడానికి ఇబ్బంది పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్, సోషల్ మీడియా యుగంలో తప్పుడు వార్తల వ్యాప్తి పెరిగిందని, దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. పత్రికలు పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలంటే యాజమాన్యాల ధోరణి మారాలని, వ్యాపార దృష్టి తో కాకుండా ప్రజల సమస్యల పరిష్కార కోణంలో పని చేయాలని సూచించారు. యాజమాన్య వాటాలో పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు కాకుండా ప్రజలు, మీడియా పైన అభిమానం ఉన్నవారు ఆయా సంస్థలకు స్వచ్ఛందంగా చందాలు ఇచ్చి లాభాపేక్ష లేని వాటాదారులుగా ఉండాలని పేర్కొన్నారు. అప్పుడే ప్రింట్ మీడియాను రక్షించుకునే అవకాశం ఉందని వివరించారు.

ఖర్చులు పెరిగి పోతున్నాయి
ఖర్చులు పెరిగి పోతున్నాయని, న్యూస్ ప్రింట్ ధరలు, ఇంక్ ధరలు బాగా పెరిగాయని అమర్ వివరించారు. దీంతో యాజమాన్యాలు వ్యాపార ధోరణిని అవలంబిస్తున్నాయని చెప్పారు. ఒక్కో పత్రిక ప్రింట్ కావాడానికి సుమారు 30 రూపాయలు ఖర్చయితే. దానిని మార్కెట్ లో అమ్మేది 5 నుంచి 7 రూపాయలకు మాత్రమేనని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో పత్రికలను కాపాడుకోవాల్సిన భాద్యత అందరి పైన ఉందని పిలుపునిచ్చారు. సమావేశానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య ఘంటా చక్రపాణి మాట్లాడుతూ విశ్వ విద్యాలయ అభివృద్ధికి ప్రొ. బషీరుద్దీన్ చేసిన సేవలు మరువలేనివన్నారు. వర్సిటీకి మౌలిక వసతుల ఏర్పాటుకు తీవ్ర కృషి చేశారన్నారు. ప్రస్తుత పరిస్థితులలో సమాజాన్ని జాగృతం చేయడంలో మీడియా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యులకు అండగా నిలవడానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి పాత్రికేయులు, మీడియా సంస్థలు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణారెడ్డి, విభాగాధిపతులు, డీన్స్, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News