Trending Now

హ్యాట్రిక్​ ప్రధాని మోదీ..


– జూన్​ 8 లేదా 9న ప్రమాణ స్వీకారం చేస్తారు: కిషన్​ రెడ్డి
– దేశ అభివృద్ధి, సమైక్యత కోసం బీజేపీకి ఓటు వేయండి
– మోదీ వచ్చాక మత కలహాలు, కర్ఫ్యూలు లేవు

ప్రతిపక్షం, చేవెళ్ల, హిమాయత్ నగర్ : హ్యాట్రిక్​ ప్రధానిగా మోదీ జూన్ 8 లేదా 9నప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశం కోసం, అభివృద్ధి కోసం ఓటు వేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. భారత దేశ గౌరవాన్ని పెంచడం కోసం ఓటెయ్యాలన్నారు. మోదీ ప్రధాని అయ్యేవరకు దేశం ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం చేవెళ్ల పార్లమెంట్​ నియోజకవర్గ బూత్ స్థాయి నేతల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ‘‘పదేళ్లకు ముందు దేశంలో ఉగ్రవాదం, మత కల్లోలాలు ఉండేవి. మేము వచ్చాక బుల్డోజర్ ప్రభుత్వం వచ్చింది. గతంలో కీలు బొమ్మలాంటి ప్రధాని ఉండేవారు. ప్రధానిగా మోదీ ప్రపంచలో నంబర్ వన్‌గా నిలిచారు. పదేళ్లకు ముందు అన్ని వస్తువులు విదేశాల నుంచి వచ్చేవి. మోదీ వచ్చాక చిన్న పిల్లల బొమ్మల నుంచి చంద్రయాన్ వరకు మనమే తయారు చేస్తున్నాం. రక్షణ శాఖ ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నాం. మన్మోహన్ సింగ్ పదేళ్లు పరిపాలించారు. కాంగ్రెస్ హయాంలో పదిహేను రోజులకో కుంభకోణం జరిగేది. వందల, వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ హయాంలో దోపిడీ చేశారు. గత పదేండ్ల బీజేపీ పాలనలో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదు”అని కిషన్​ రెడ్డి వివరించారు.

కాంగ్రెస్​ వస్తే జిన్నా రాజ్యాంగం..

బీజేపీ పుట్టిందే ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా అని కిషన్​ రెడ్డి తెలిపారు. ‘‘బీజేపీ చేసిన అభివృద్ధికి.. కాంగ్రెస్ చేసిన అభివృద్ధికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370తొలగిస్తామని చెప్పాం.. చేశాం. జమ్మూ కశ్మీర్‌లో జిన్నా రాజ్యాంగాన్ని తొలగించి.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తెచ్చాం. మళ్లీ జిన్నా రాజ్యాంగాన్ని తెస్తామని రాహుల్ గాంధీ చెప్తున్నాడు. లవ్ జీహాదిని చట్టపరం చేస్తామని చెప్తున్నారు. మీ ప్రభుత్వంలో.. పోలీస్ శాఖలో లవ్ జీహాదిని కాపాడే విభాగాన్ని ఏర్పాటు చేశారా’’ అంటూ రేవంత్‌ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. త్రిపుల్​ తలాక్ తీసేసి ముస్లిం ఆడబిడ్డలను రక్షించామని కిషన్​ రెడ్డి గుర్తు చేశారు.

హిందూ వ్యతిరేక మేనిఫెస్టో..

కాంగ్రెస్ మేనిఫెస్టో హిందూ వ్యతిరేక మేనిఫెస్టో అని కిషన్​ రెడ్డి ఆరోపించారు. ‘‘స్వాత్యంత్రం రాకముందు ఉన్న ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. జీఎస్టీని రద్దు చేస్తాం.. కుంభకోణాలను ఎంకరేజ్ చేస్తాం అంటున్నారు. తెలంగాణకు అనేక హామీలను తుక్కుగూడ నుంచి రాహుల్ ఇచ్చారు. రాష్ట్రానికి మీరిచ్చిన గ్యారెంటీలు ఎంత వరకు అమలు చేశారు.. చెప్పండి.? రుణమాఫీ ఎంత వరకు చేశారు.? డిసెంబర్ లో రుణమాఫీ చేస్తామని రేవంత్​ రెడ్డి చెప్పాడు. నిధులు ఎక్కడ నుంచి తెస్తారో చెప్పాలి.? ఎకరానికి రూ.15 వేలు ఎక్కడికి పోయినయ్? మీ గ్యారంటీలు ఎక్కడికి పోయినయ్.? బస్సులల్ల తిరిగితే అన్నీ ఇచ్చాం అనుకోండి అంటున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తామని మేము చెప్పాం.. చేసి చూపాం. ఇది మోదీ గ్యారెంటీ. అనేక పోరాటాల తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని కట్టుకున్నాం.. మోదీ హయాంలో రామ మందిరం పూర్తయ్యింది.. కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం పేరుతో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు.. దేవాలయాన్ని ధ్వంసం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ కూర్చుంది.. అయోధ్య ఆలయాన్ని జవహర్ లాల్ నెహ్రూ అడ్డుకున్నాడు.. వల్లభాయ్ పటేల్ అయోధ్యను కాపాడుదాం అంటే నెహ్రూ ఆపాడు” అని కిషన్ రెడ్డి తెలిపారు.

Spread the love

Related News

Latest News