నేపాలీ గ్యాంగ్.. కన్నుపడితే బంగారం హాంఫట్

ప్రతిపక్షం, జూన్ 10: హైదరాబాద్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న భారీ చోరీల వెనుక నేపాలీ ముఠాల హస్తం వెలుగులోకి వచ్చింది. ఇళ్లలో పనివారిగా చేరి యజమానుల నమ్మకం పొందిన తర్వాత విలువైన నగలు, నగదును అపహరిస్తున్న ఈ ముఠాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

ఇటీవల గచ్చిబౌలిలోని ఓ విల్లాలో జరిగిన భారీ చోరీ కేసు నగరంలో కలకలం రేపింది. ఈ నెల 6న జరిగిన ఘటనలో దుండగులు ఏకంగా 8 కిలోల బంగారం, కేజీన్నర వెండి ఆభరణాలను అపహరించి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు.

విచారణలో నిందితులు నేపాలీ ముఠాకు చెందినవారని తేలడంతో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. చివరకు ఉత్తరప్రదేశ్‌లో నిందితులను అదుపులోకి తీసుకుని, చోరీకి గురైన ఆస్తిలో గణనీయమైన భాగాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఇళ్లలో పనివారిని నియమించుకునే సమయంలో వారి పూర్తి వివరాలు, గుర్తింపు పత్రాలు, చిరునామా ధ్రువీకరణ తప్పనిసరిగా చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదు ప్రక్రియ పూర్తి చేయడం, నేపథ్య వివరాలను ధృవీకరించడం ద్వారా ఇలాంటి ఘటనలను నివారించవచ్చని తెలిపారు.

నగరంలో పనిచేసే గృహసహాయకులు, కార్మికుల వివరాలను సక్రమంగా నమోదు చేయకపోతే చోరీల ముప్పు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Spread the love

Related News

Latest News