ప్రియుడి కోసం భర్త హత్య.. మియాపూర్‌లో భార్య దారుణం

ప్రతిపక్షం, జూలై 07: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భార్యే భర్తను హత్య చేసి, ప్రియుడితో కలిసి శవాన్ని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో పూడ్చిపెట్టిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పెంటేశ్‌ (45) అనే వ్యక్తిని అతని భార్య సత్యవతి తన ప్రియుడి సహాయంతో హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

హత్య అనంతరం నేరాన్ని దాచిపెట్టేందుకు నిందితులు శవాన్ని వాహనంలో తరలించి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి తీసుకెళ్లి పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం అనుమానం రాకుండా భర్త కనిపించడం లేదంటూ సత్యవతి పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది.

అయితే కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కాల్ డేటా రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించగా అసలు ఘటన వెలుగులోకి వచ్చింది. విచారణలో భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో లోతుగా దర్యాప్తు చేపట్టిన అధికారులు హత్య వెనుక ఉన్న కుట్రను ఛేదించారు.

ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు, హత్యకు దారితీసిన పరిస్థితులు, ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా చర్యలు చేపట్టినట్లు సమాచారం.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, కుటుంబ కలహాలు చివరకు హత్యకు దారితీయడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

Spread the love

Related News

Latest News