ప్రతిపక్షం, జూలై 07: భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొని, చివరి శ్వాస వరకు నీతి, నిజాయితీతో జీవించారని కొనియాడారు. గోదావరి జలాల సాధన, మూసీ పరిరక్షణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచారని గుర్తుచేశారు.
భూదానోద్యమానికి తన 300 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప మానవతావాదిగా కొమ్మిడి నర్సింహారెడ్డి నిలిచారని సీఎం పేర్కొన్నారు. 1978, 1983 సంవత్సరాల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారని తెలిపారు. నిరాడంబర జీవనశైలితో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన ఆయన నేటి తరానికి ఆదర్శమని అభివర్ణించారు.
కొమ్మిడి నర్సింహారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలంగాణ సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
















