Choreographer Johnny Master Arrested: లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అతన్ని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. రేపు జానీ మాస్టర్‌ను రిమాండ్‌కి పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం చేశారన్న ఆరోపణలతో జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తనను పలు మార్లు లైంగికంగా వేధించాడంటూ జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేసిన మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబయి, చెన్నైతో సహా పలు ప్రాంతాల్లో ఔట్ డోర్ షూటింగ్స్ సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. తన ఇంట్లో కూడా పలుమార్లు లైంగికంగా వేధించాడని పేర్కొంది. తను ప్రతిఘటించిన ప్రతిసారి దాడి చేశాడని, తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని పోలీసుకు కంప్లయింట్ చేసింది. ఆఫర్లు ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.