ప్రతిపక్షం, జూలై 05: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదులు ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శాస్త్రీయ పునరుద్ధరణ పూర్తై జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతులు వచ్చే వరకు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయబోమని స్పష్టం చేశారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందన్న బీఆర్ఎస్ ప్రచారాన్ని ఖండించిన ఆయన, ఇది రాజకీయ అంశం కాదని, ప్రజల భద్రతకు సంబంధించిన ఇంజినీరింగ్ అంశమని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం ఇంజినీరింగ్ ప్రమాణాలను విస్మరించి రాజకీయ, వాణిజ్య ప్రయోజనాల కోసం ప్రాజెక్టు రూపకల్పన మార్చిందని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును యథాతథంగా అమలు చేసి ఉంటే ఉత్తర తెలంగాణకు గురుత్వాకర్షణ ద్వారా స్థిరమైన నీటి సరఫరా లభించేదన్నారు. ప్రస్తుతం ఎన్‌డీఎస్‌ఏ నివేదికలో మూడు బ్యారేజీల పునాదుల్లో సీపేజ్, పైపింగ్, స్టిల్లింగ్ బేసిన్ల లోపాలు, సెకెంట్ పైల్ కట్‌ఆఫ్ గోడల బలహీనత, నిర్మాణ నాణ్యతలో వైఫల్యాలు వంటి తీవ్ర సాంకేతిక లోపాలు గుర్తించినట్లు తెలిపారు. మేడిగడ్డలో బ్లాక్-7 కింద పునాది కుంగిపోయిందని, అన్నారం, సుందిళ్లలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయని వెల్లడించారు.
బ్యారేజీల పునరుద్ధరణ కోసం గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) సర్వేలు, 80 మీటర్ల లోతు వరకు బోర్‌హోల్స్, ప్రయోగశాల పరీక్షలు, హైడ్రాలిక్ మోడలింగ్, కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ (సీఎఫ్‌డీ) విశ్లేషణలు, డిజిటల్ ట్విన్ సిమ్యులేషన్లు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పుణెలోని సీడబ్ల్యూఆర్‌పీఆర్‌ఎస్, ఐఐటీ బాంబే, అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో ఈ అధ్యయనాలు కొనసాగుతున్నాయని చెప్పారు. వరదలు తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించి 2027 జూలై–ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అప్పటి వరకు మూడు బ్యారేజీలు ఫ్రీ ఫ్లో విధానంలోనే కొనసాగుతాయని, ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.















