ప్రతిపక్షం, జూన్ 12: హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు తక్షణ అనుమతులు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కోరారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు ప్రాధాన్యతను సీఎం వివరించారు.
అత్యంత వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరానికి 76.4 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన మెట్రో ఫేజ్-2 ఎంతో అవసరమని తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలైతే నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రజలకు వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పర్యావరణహిత, సుస్థిర పట్టణాభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సూచనల మేరకు అవసరమైన మార్పులు చేసి ప్రాజెక్టు డీపీఆర్‌ను ఇప్పటికే సమర్పించినట్లు సీఎం గుర్తుచేశారు. మెట్రో ఫేజ్-2 అత్యవసరతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖల నుంచి పెండింగ్ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

















