ప్రతిపక్షం, జూలై 15: తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్య ద్వారానే ఆత్మగౌరవం, అభివృద్ధి సాధ్యమవుతాయని, చదువే ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు బలమైన పునాదని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకుల కంటే విద్యార్థుల త్యాగాలే గొప్పవని గుర్తుచేసిన సీఎం.. వారి బలిదానాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందన్నారు. అందుకే విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీల నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం విద్యా రంగాన్ని బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
















