ప్రతిపక్షం, జూన్ 03: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ భుజంగరావుకు చెందిన ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై నమోదు చేసిన కేసు నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. భుజంగరావుకు చెందిన నివాసాలు, బంధువుల ఇళ్లు సహా మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
సూర్యాపేట జిల్లాలోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సోదాల్లో ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, లావాదేవీల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే అరెస్టై న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కొంటున్న భుజంగరావు ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. ఆయన పోలీసు శాఖలో విధులు నిర్వహించిన కాలంలో అక్రమంగా ఆస్తులు సమకూర్చుకున్నారనే ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది.
సోదాలు పూర్తైన అనంతరం స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఇతర ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.

















