ఆర్ఎస్ ప్రవీణ్ సతీమణి బదిలీపై వివాదం.. ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు

ప్రతిపక్షం, జూలై 02: బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి బదిలీ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మార్కెటింగ్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆమెను జీతం అందని పోస్టుకు బదిలీ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ అంశంపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్‌రావు, ఏడాదిలో పదవీ విరమణ పొందనున్న ఉద్యోగులను బదిలీ చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించిందని ఆరోపించారు. రాజకీయ కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.

గతంలో మంత్రి శ్రీధర్ బాబు సతీమణి ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న సమయంలో తాము ఎప్పుడూ కక్షపూరితంగా వ్యవహరించలేదని గుర్తుచేసిన హరీశ్‌రావు, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోందని విమర్శించారు. ఈ బదిలీ నిర్ణయాన్ని వెంటనే పునఃసమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News