గ్రిడ్‌పై పడే భారంపై కర్నాటకలో అధ్యయనం
హైదరాబాద్, స్టేట్బ్యూరో: గృహజ్యోతి పథకంపై రాష్ట్ర ప్రభుత్వంపై ముఖ్యంగా విద్యుత్ సంస్థపై(గ్రిడ్) పడే భారాన్ని అధ్యయనం చేసేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థ అధికారులు బెంగుళూరు వెళ్లారు. ఈ పథకం అమలు చేస్తున్న కర్నాటక ప్రభుత్వ అధికారులతో భారంతో పాటు గ్రిడ్‌పై ఏ సమయంలో , ఏ మాసంలో పడే భారాన్ని సైతం అధ్యయనం చేయబోతున్నారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా 200 యూనిట్ల కరెంటును ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలు పర్యవేక్షణ చేయడానికి కర్ణాటకకు తెలంగాణ విద్యుత్ డిస్కం అధికారులు వెళ్లారు. ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల గ్రిడ్‌పై ఎంత భారం పడుతుందో తెలుసుకోనున్నారు.
ఆరు గ్యారంటీల్లో ఒకటైన గృహ జ్యోతిద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయనుంది. ప్రస్తుతం 18 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చినా సరఫరాకు, గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బందులు రావు. అయితే ఈ పథకం ప్రారంభమై ఆ డిమాండ్ కన్నా పెరిగితే అది రాష్ట్ర విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, గ్రిడ్‌పై అదనంగా ఎంత భారం పడుతుందనేదే కీలకంగా మారింది. ఈ అంశంపై అధికారులు ఇప్పుడు దృష్టి సారించారు. అయితే రాష్ట్ర చరిత్రలో అత్యధిక రోజువారీ డిమాండ్ 2023 మార్చిలో 15,450 మెగావాట్లు నమోదైంది. అదే ఈ మంగళవారం ఉదయం 7.47 గంటలకు 14,779 మెగావాట్ల డిమాండ్ నమోదైంది.
బుధవారం 14,913 మెగావాట్లుగా రికార్డు అయింది. వచ్చే నెలలో ఈ డిమాండ్ 16 వేల మెగావాట్లను దాటొచ్చని అంచనా. 24 గంటల మొత్తం వినియోగం ఈనెల 19న 28.14 కోట్ల యూనిట్లను దాటింది. గత నెల 2న వినియోగం 22.80 కోట్ల యూనిట్లుంటే వేసవి ఇంకా పూర్తి ప్రారంభం కాకముందే అంతకన్నా ఏకంగా దాదాపు 5 కోట్ల యూనిట్ల వినియోగం పెరిగింది. వచ్చే నెలలో అది 30 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇళ్లకు ఉచిత కరెంటు పథకంప్రారంభమైతే ఇంకా ఎక్కువ డిమాండ్ రావచ్చని విద్యుత్ ఇంజినీర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
‘రాష్ట్రంలో 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌దే’
కర్ణాటకలో 43% వినియోగం పెరుగుదల : గత ఆగస్టులో కర్ణాటకలో ఉచిత విద్యుత్ సరఫరా ప్రారంభమైన సమయంలో వర్షాల్లేక 2022తో పోలిస్తే ఏకంగా 43 శాతం వినియోగం పెరిగింది. అయితే తెలంగాణలో ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదు అవుతుంది. ఇదే సమయంలో ఉచిత విద్యుత్ పథకాన్నిరాష్ట్రంలో ప్రారంభించడం వల్ల ఉదయం, సాయంత్రం వేళల్లో సరఫరాకు విద్యుత్ గ్రిడ్ నిర్వహణ సవాల్‌గా మారే అవకాశం ఉంది.
ఉత్తర డిస్కం పరిధిలో ఎక్కువ శాతం : రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్‌తో కలిపి దక్షిణ తెలంగాణ డిస్కంలో కన్నా వరంగల్ కేంద్రంగా ఉత్తర తెలంగాణ డిస్కంలోనే నెలకు 200 యూనిట్ల కరెంటు వాడే వినియోగదారులు అధిక శాతం ఉన్నారు. ఎందుకంటే ఆ ఉత్తర తెలంగాణ డిస్కంలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. అందువల్ల ఆ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఉచిత విద్యుత్ పంపిణీలోకి రానున్నారు. వీరిలో లబ్ధిదారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు తయారు చేస్తోంది.
అయితే గృహజ్యోతి పేరుతో ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంటును గత ఆగస్టు నుంచి కర్ణాటక ప్రభుత్వం ఇస్తోంది. ఈ మేరకు అక్కడకు వెళ్లి తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) అధికారులు అధ్యయనం చేయనున్నారు. రెండున్నర కోట్లకు పైగా గృహ వినియోగదారుల్లో 85.36 శాతం మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు.
కర్ణాటక(Karnataka)లో మూడు డిస్కంలలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు ఉన్న హుబ్లీ డిస్కం పరిధిలో 94.57 శాతం, చాముండేశ్వరీ డిస్కం పరిధిలో 92.04 శాతం, బెంగళూరు డిస్కం పరిధిలో 75.75 శాతం మంది వినియోగదారులు ఈ పథకం కింద నమోదు అయ్యారు. అయితే ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం నెలకు వాడిన కరెంటు సగటు యూనిట్లపై 10 శాతం అదనంగా ఉచితంగా ఇస్తోంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణ అధికారులు అధ్యయనం చేయడానికి వెళ్లనున్నారు.