బెంగళూరులో రక్తపాతం.. ఒక్క రాత్రిలో మూడు హత్యలు కలకలం

ప్రతిపక్షం, జూన్ 30: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒకే రాత్రిలో మూడు వేర్వేరు హత్యలు చోటుచేసుకోవడంతో నగరంలో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనల్లో ఇద్దరు మహిళలు, ఓ రౌడీషీటర్ మృతిచెందగా, పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం, స్థానికంగా ‘హల్మక్ రాజా’గా గుర్తింపు పొందిన రౌడీషీటర్‌పై ప్రత్యర్థి ముఠా సభ్యులు నడిరోడ్డుపై పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు. ఘటన అనంతరం నిందితులు పరారయ్యారు. ఈ హత్య గ్యాంగ్‌వార్, పాత కక్షల నేపథ్యంలో జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

అదే రాత్రి నగరంలోని మరో రెండు ప్రాంతాల్లో ఇద్దరు మహిళలు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలు వ్యక్తిగత కారణాలతో జరిగాయా? లేక మూడు కేసులకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

సీసీటీవీ ఫుటేజీలు, ఫోరెన్సిక్ ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సేకరిస్తూ ప్రత్యేక బృందాలు దర్యాప్తు వేగవంతం చేశాయి. వరుస హత్యలతో బెంగళూరు నగరంలో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Spread the love

Related News

Latest News