ప్రతిపక్షం, ఆగస్టు 14, హైదరాబాద్: కేవలం విద్యా సర్టిఫికెట్లు ఉన్నంత మాత్రాన ఉద్యోగం వస్తుందనే గ్యారంటీ లేదని, నైపుణ్యం ఉంటే మాత్రం ఉపాధి అవకాశాలు తప్పకుండా లభిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. యువత సంప్రదాయ విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు.
హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. 12వ తరగతి విద్య తర్వాత విద్యార్థులు తమ ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా పాలిటెక్నిక్, నైపుణ్య విశ్వవిద్యాలయం, నర్సింగ్ వంటి సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులను ఎంచుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఉద్యోగ మార్కెట్‌లో నైపుణ్యాలకు మరింత ప్రాధాన్యం పెరగనుందని చెప్పారు.
ప్రస్తుతం కృత్రిమ మేధ కారణంగా ఐటీ రంగంలో ఉద్యోగాలపై ప్రభావం పడుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యువత కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం డిగ్రీలు, సర్టిఫికెట్లపై ఆధారపడకుండా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ నేపథ్యంలోనే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టాటా సంస్థతో చర్చించి 2024లోనే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించినట్లు చెప్పారు.
యువతకు పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించి ఉద్యోగాలకు సిద్ధం చేయడమే ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశమని సీఎం తెలిపారు. తెలంగాణలో విద్య, నైపుణ్యం, ఉపాధి మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.





























