[t4b-ticker]

బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణే లక్ష్యం: కల్వకుంట్ల కవిత

ప్రతిపక్షం, ఆగస్టు 31: నిజామాబాద్‌లో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ రాజకీయ వేడిని పెంచింది. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో జరిగిన ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పదవుల కోసం కాకుండా ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలనే సంకల్పంతోనే తాను కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించానని చెప్పారు. ‘‘బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణ కావాలి’’ అని ఆమె నినదించారు.

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఉద్దేశం ప్రజలు తమను తాము పాలించుకోవడం, తమ జీవితాల్లో మార్పు తీసుకురావడమేనని కవిత అన్నారు. రాష్ట్ర సాధన కోసం వేలాది మంది చేసిన త్యాగాలను గుర్తుచేస్తూ.. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల బతుకులు నిజంగా మారాయా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించేందుకు కొత్త ఆలోచన, కొత్త రాజకీయ శక్తి అవసరమని పేర్కొన్నారు.

నిజామాబాద్ గడ్డకు పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి రావడం ఎంతో ఆనందంగా ఉందని కవిత అన్నారు. నిజామాబాద్ ప్రజలు తనను రెండు దశాబ్దాలుగా తమ బిడ్డగా చూస్తున్నారని, ఎంపీగా, ఎమ్మెల్సీగా గెలిపించి తనకు రాజకీయంగా ఎంతో ధైర్యం ఇచ్చారని గుర్తుచేశారు. ఇకపై కూడా ప్రజల సమస్యలపై ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడుతానని స్పష్టం చేశారు. తనకు పదవులు అవసరం లేదని, ఇప్పటికే తాను చూడని పదవులు ఏమీ లేవని, ప్రజల కోసం పనిచేయాలనే సంకల్పంతోనే కొత్త పార్టీని ఏర్పాటు చేశానని చెప్పారు.

తనపై గతంలో జరిగిన పరిణామాలను ప్రస్తావించిన కవిత.. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా జైలుకు పంపారని ఆరోపించారు. నాలుగేళ్లపాటు దర్యాప్తు సంస్థల విచారణలు, ఒత్తిళ్లు ఎదురైనా తన ధైర్యం సడలలేదని, తాను ఎప్పుడూ దారి తప్పలేదని అన్నారు. ‘‘మీ నిజామాబాద్ బిడ్డ నిప్పు.. నేను మొదటి రోజు నుంచి తప్పు చేయలేదని చెబుతున్నాను’’ అని పేర్కొన్నారు. తనపై జరిగిన అన్యాయంపై అప్పట్లో మాట్లాడిన కొందరు నాయకులు ఆ తర్వాత ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

సొంతూరుకు వచ్చిన సందర్భంలో భావోద్వేగానికి గురైన కవిత.. తనకు కన్నీళ్లు రావడం సహజమేనని అన్నారు. ఆడబిడ్డకు బాధ కలిగితే కన్నీళ్లు వస్తాయని, అందుకే తనను పిరికిదానిగా భావించవద్దని స్పష్టం చేశారు. కష్టకాలంలో తనను ఆదరించిన అత్తమామలను ఆమె ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. అమ్మ ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా బయటకు పంపిన సమయంలో అత్తింటి వారు కన్న కూతురిలా తనను అక్కున చేర్చుకున్నారని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కవిత తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. రైతు భరోసా సహా అనేక హామీలు సక్రమంగా అమలు కాలేదని ఆరోపించారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం కూడా తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించడం లేదని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆమె నిలదీశారు.

బీఆర్ఎస్ నాయకత్వంపైనా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయంగా ఓడించేందుకు కొందరు నాయకులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన తండ్రి, తనను రాజకీయంగా దెబ్బతీయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. గతంలో తాను ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోయినా ఆయన గెలుపు కోసం పనిచేశానని, ఆయనకు మంత్రి పదవి కూడా వచ్చిందని గుర్తుచేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ ఓడిపోయిన వెంటనే అధికార కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

బీఆర్ఎస్‌లో ఉన్నప్పటి పరిస్థితులను కూడా కవిత ప్రస్తావించారు. పార్టీ ఓటమి తర్వాత తాను ఇంట్లో కూర్చోకుండా ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తనతో పాటు తన కుటుంబంపై రాజకీయంగా అనేక విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదన్నారు. తన కొత్త రాజకీయ ప్రయాణంలో యువతకు, కొత్త నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. ‘‘పెద్ద నాయకులు లేరని అంటున్నారు.. పెద్ద నాయకులు ఉన్న పార్టీని ప్రజలు ఇంటికి పంపించలేదా? మేము చిన్న నాయకులమైనా పర్వాలేదు.. ప్రజల కోసం పనిచేస్తాం’’ అని అన్నారు.

తమ పార్టీ ఐదు కీలక అంశాలతో ముందుకు సాగుతుందని కవిత తెలిపారు. శ్రీకృష్ణుడి చేతిలోని పాంచజన్య శంఖం పేరును ఈ ఐదు అంశాలకు ప్రతీకగా ఎంచుకున్నామని చెప్పారు. అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించేందుకు పాంచజన్యం పూరించినట్టే ప్రజల హక్కుల కోసం తమ పార్టీ పోరాడుతుందని అన్నారు.

విద్య, వైద్యం తమ పార్టీ ప్రధాన ప్రాధాన్యాల్లో ఉంటాయని కవిత ప్రకటించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు విద్య, వైద్యం కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయని, కుటుంబంలో ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం వస్తే ఇళ్లు, బంగారం అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అవకాశం ఇస్తే ఉచిత విద్య, వైద్యం అందించే విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో గణనీయమైన మొత్తాన్ని విద్య, వైద్య రంగాలకు కేటాయించవచ్చని అన్నారు.

యువతకు ఉపాధి, పారిశ్రామిక అవకాశాలు కల్పించడంపైనా దృష్టి పెడతామని కవిత తెలిపారు. యువత తమ సొంత పరిశ్రమలు, వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు రుణ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. చిన్న స్థాయి వ్యాపారాల నుంచి పెద్ద పరిశ్రమల వరకు యువతను ప్రోత్సహించే విధానాలు తీసుకువస్తామని పేర్కొన్నారు. యువతకు ఆర్థికంగా అండగా నిలవడం ద్వారా రాష్ట్రంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చని అన్నారు.

సామాజిక న్యాయం తమ పార్టీ ప్రధాన లక్ష్యమని కవిత స్పష్టం చేశారు. సమాజంలోని ప్రతి కులం, ప్రతి వర్గానికి సమాన అవకాశాలు లభించినప్పుడే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలతో పాటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఇతర వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పోరాడతామని చెప్పారు. భూమిలేని అర్హులైన పేదలకు భూమి అందించేందుకు ‘భూలక్ష్మి’ వంటి కార్యక్రమాన్ని తీసుకురావాలనే ఆలోచనను వెల్లడించారు.

నిజామాబాద్ జిల్లాలో బీడీ కార్మికుల సమస్యలను కూడా కవిత ప్రస్తావించారు. బీడీ కార్మికులకు పింఛన్లు వచ్చేలా గతంలో తాను కృషి చేశానని, అయితే ఆ తర్వాత పింఛన్ల పెంపు, కొత్త అర్హులకు పింఛన్ల మంజూరులో పురోగతి కనిపించలేదని అన్నారు. బోధన్ చక్కెర కర్మాగారం పునరుద్ధరణ కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు. అవసరమైతే వారి కోసం ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు.

నిజామాబాద్‌లోని మాధవ్‌నగర్ వంతెన నిర్మాణంపై ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను కవిత ప్రశ్నించారు. ఏళ్లుగా వంతెన పనులు ఎందుకు పూర్తికావడం లేదని నిలదీశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో ఈ అంశంపై ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేశారు. పసుపు బోర్డు పేరుతో రైతులకు పెద్దగా ప్రయోజనం కలగలేదని విమర్శించారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు.

నిజామాబాద్ జిల్లాలో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ బలమైన పోటీ ఇస్తుందని కవిత ప్రకటించారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కొత్త నాయకత్వాన్ని తయారు చేసి ‘షాడో ఎమ్మెల్యేలు’గా పనిచేసే వ్యవస్థను నిర్మిస్తామని చెప్పారు. ప్రజల మధ్య ఉండే యువ నాయకులకు అవకాశాలు కల్పిస్తామని, వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌తో ఒకవైపు పోరాటం చేస్తూనే తమ రాజకీయ సంస్థను బలోపేతం చేస్తామని కవిత చెప్పారు. ప్రతిపక్షం ప్రజల సమస్యలపై నిద్రపోతే తాము ప్రజల తరఫున గొంతెత్తుతామని అన్నారు. మైనార్టీల హక్కుల కోసం కూడా నిరంతరం పోరాడతామని తెలిపారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన యాప్‌లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణను కేవలం ఆర్థికంగా అభివృద్ధి చేయడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కవిత తెలిపారు. ‘‘బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణ కావాలి’’ అనే నినాదంతో ముందుకు సాగుతానని చెప్పారు. ప్రజల ఆశీర్వాదం, మద్దతుతో కొత్త రాజకీయ శక్తిని నిర్మించి తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే తన సంకల్పమని ఆమె స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News