ప్రతిపక్షం, ఆగస్టు 31: బ్యాంకాక్‌లో ఓ లగ్జరీ బార్‌లో చోటుచేసుకున్న విచిత్ర ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నకిలీ ప్రవేశ కార్డుతో బార్‌లోకి వెళ్లిన ఓ యువతి అక్కడ ఖరీదైన మద్యం, ఆహారాన్ని తీసుకుంది. చివరికి భారీగా బిల్లు రావడంతో డబ్బులు చెల్లించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా సిబ్బంది ఆమెను పట్టుకున్నారు.
బార్‌లో యువతి చేసిన ఖర్చు ఏకంగా రూ.1.72 లక్షలకు చేరినట్లు సమాచారం. అయితే బిల్లు చెల్లించేందుకు ఆమె వద్ద డబ్బులు లేకపోవడంతో సిబ్బంది, యువతి మధ్య ఓ విచిత్రమైన ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. తన వద్ద ఉన్న పొడవాటి జుట్టును ఇస్తానని ఆమె చెప్పడంతో బార్ నిర్వాహకులు అందుకు అంగీకరించినట్లు సమాచారం.
దీంతో సిబ్బంది ఆమె తల వెంట్రుకలను పూర్తిగా తొలగించి గుండు గీశారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి పంపించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. బిల్లు చెల్లించకపోవడం తప్పేనని కొందరు అంటుండగా, దానికి శిక్షగా యువతి జుట్టును తొలగించడం ఎంతవరకు సమంజసమని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
లగ్జరీ బార్‌లోకి నకిలీ ప్రవేశ కార్డుతో వెళ్లడం, భారీగా ఖర్చు చేయడం, బిల్లు చెల్లించకుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడం వంటి అంశాలపై కూడా చర్చ సాగుతోంది. అయితే యువతి జుట్టును తొలగించిన ఘటనపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.





























