రాహుల్‌ ప్రధాని కావాలంటే జీవితాంతం మాక్‌ పార్లమెంటులోనే ఉండాలి: అమిత్‌ షా సెటైర్లు!

ప్రతిపక్షం, నవంబర్ 01: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే కలలు కనడం మానుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధాని కావాలనుకుంటే జీవితాంతం మాక్ పార్లమెంటులోనే ఉండాల్సి వస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

చండీగఢ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ర్యాలీపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. 1984లో సిక్కుల ఊచకోత జరిగిన రోజునే కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేపట్టడం బాధితుల గాయాలపై ఉప్పు చల్లినట్లుగా ఉందని మండిపడ్డారు. ఆ విషాద ఘటనలో వేలాది మంది సిక్కులు ప్రాణాలు కోల్పోయారని, అలాంటి రోజున రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

1984లో ఇదే రోజున కాంగ్రెస్ పాలనలో సిక్కులపై దాడులు జరిగాయని అమిత్ షా ఆరోపించారు. ఆ ఘటనలో బాధిత కుటుంబాలు ఎదుర్కొన్న బాధను గుర్తుచేస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. చారిత్రక ఘటనలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నాయకత్వం వైఖరిని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్న ఆకాంక్షపై వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ రాజకీయ విధానాలపైనా విమర్శలు చేశారు.

Related News

Latest News