ప్రతిపక్షం, ఆగస్టు 05: తెలంగాణలో అత్యవసర సేవలను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వినియోగంలో ఉన్న డయల్–100 సేవలకు బదులుగా ఇకపై అన్ని అత్యవసర అవసరాల కోసం ‘112’ అనే ఏకీకృత ఎమర్జెన్సీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అధికారికంగా ప్రారంభించారు.
ఇకపై పోలీసు సహాయం, అంబులెన్స్, అగ్నిమాపక సేవలు తదితర అత్యవసర అవసరాల కోసం ప్రజలు కేవలం 112 నంబర్‌కు కాల్ చేస్తే సరిపోతుందని డీజీపీ తెలిపారు. వేర్వేరు నంబర్లకు కాల్ చేయాల్సిన అవసరం లేకుండా అన్ని సేవలను ఒకే వేదికపై సమన్వయం చేయడం ద్వారా స్పందన సమయం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.
అత్యాధునిక సాంకేతికతతో అత్యవసర స్పందన వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్త వ్యవస్థలో ఒకేసారి 960 కాల్స్ స్వీకరించే సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో కాల్స్ బిజీ అయ్యే సమస్యలు తగ్గనున్నాయి.
ప్రతి పౌరుడు తమ మొబైల్ ఫోన్‌లో 112 నంబర్‌ను తప్పనిసరిగా సేవ్ చేసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ పిలుపునిచ్చారు. ప్రమాదాలు, నేరాలు, అగ్నిప్రమాదాలు, వైద్య అత్యవసర పరిస్థితులు వంటి సందర్భాల్లో ఈ నంబర్‌కు వెంటనే కాల్ చేసి సహాయం పొందాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవలను మరింత సమర్థవంతంగా అందించడంలో ఈ ఏకీకృత వ్యవస్థ కీలకంగా మారుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

















