ప్రతిపక్షం, జూన్ 30: 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి కేంద్ర ప్రభుత్వానికి మరో భారీ మొత్తంలో డివిడెండ్ అందింది. ఇప్పటికే భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి డివిడెండ్ అందుకున్న కేంద్రానికి తాజాగా మరో రూ.9,439 కోట్ల మేర నిధులు సమకూరాయి.
ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ రూ.2,397 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.2,811 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.2,416 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.1,815 కోట్ల డివిడెండ్ చెక్కులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేశాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మెజారిటీ వాటా కేంద్ర ప్రభుత్వానిదే కావడంతో, ఆయా బ్యాంకులు తమ వార్షిక నికర లాభాల్లో కొంత భాగాన్ని డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తాయి. ఈ నిధులు ప్రభుత్వ ఆదాయాన్ని బలోపేతం చేయడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఉపయోగపడనున్నాయి.

















