పొటాపొటీగా ప్రాజెక్టుల సందర్శన
బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు కాంగ్రెస్ పాలమూరు కౌంటర్
ఇప్పటికే సీఎంతో పాటు మంత్రులు మేడిగడ్డ సందర్శన
నాసిరకం పనులతో ప్రాజెక్టు గయాబ్ అంటూ కాంగ్రెస్ ఆగ్రహం
కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలమని తెలపనున్న బీఆర్ఎస్
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ల మధ్య ప్రాజెక్టుల యుద్దం కొనసాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షలకోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, సుందిళ్లలో నిర్మించిన బరాజ్‌లు కుంగిపోయి, నెర్రలు పాయడంతో నీరు నిల్వకు ఆస్కారం లేకుండా పోయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆది నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌పార్టీ, అధికారంలోకి రావడంతో కాళేశ్వరంలో జరిగిన నాసిరకం నిర్మాణం, కట్టడాలు కుంగిపోవడాన్ని సీరియస్‌గా తీసుకుంది. గత నెలలో సీఎం నేతృత్వంలో మంత్రులు, అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు (బీఆర్ఎస్)మినహా ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి అధికార బీఆర్ఎస్పార్టీ వేల కోట్లు దండుకుని నాసిరకంగా నిర్మాణం చేపట్టడంతో నేడు ప్రాజెక్టు పనికిరాకుండా పోయిందని, ప్రజల సొమ్ము కాంట్రాక్టర్లు, బీఆర్ఎస్నేతలు దోచుకున్నారంటూ ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో లోటుపాట్లను, ప్రాజెక్టు పగుళ్లు, తదితర విషయాలను సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు, కాంగ్రెస్‌పార్టీ నేతలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లగలిగారు. కాంగ్రెస్ ఆరోపణలను తిప్పి కొట్టేందుకు బీఆర్ఎస్ నేతలు సైతం మేడిగడ్డ బరాజ్ సందర్శన కార్యక్రమాన్ని చేపట్టారు.
పొటాపొటీ సందర్శనలు
కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్కేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా మీడియా సిబ్బందితో శుక్రవారం పరిశీలించేందుకు బయలు దేరనున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌పార్టీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, పాలమూరు లోక్‌సభ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సైతం శుక్రవారం పాలమూరు…రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించేందుకు వెళ్తున్నారు. ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ మేడిగడ్డ సందర్శిస్తుండగా, అధికార కాంగ్రెస్‌పార్టీ నేతలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించనున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డిని విస్మరించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఛలో పాలమూరు రంగారెడ్డి పర్యటనకు హసత్తం నేతలు పిలుపునిచ్చారు.
మరోవైపు రేపు ఛలో మేడిగడ్డకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్ నుంచి బీఆర్‌ఎస్ నేతలు బయలుదేరనున్నారు. మేడిగడ్డ విజిట్ చేసే బృందంలో ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మాజీ ఎమ్మేల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు ఉన్నారు. ఏడు బస్సుల్లో 150 మంది నేతలు మేడిగడ్డకు పయనంకానున్నారు. మధ్యాహ్నం భూపాల పల్లిలో లంచ్ చేయనున్నారు. సాయంత్రం మేడిగడ్డ వద్ద కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రిటైర్డ్ ఇంజినీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరంను ప్రభుత్వం విఫల ప్రాజెక్ట్‌గా చూపే కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ మాత్రమే కాదని గులాబీ పార్టీ చెబుతోంది. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు చెప్పడానికే చలో మేడిగడ్డ అని నేతలు అంటున్నారు. కుంగిన బ్యారేజ్‌కు మరమత్తులు చేసి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తున్నారు. చలో మేడిగడ్డకు ఆటంకాలు లేకుండా బీఆర్ఎస్ జాగ్రత్త చర్యలు చేపట్టింది. ముందే మేడిగడ్డ టూర్ షెడ్యూల్, రూట్ మ్యాప్‌న డీజీపీకి నేతలు అందజేశారు.