ప్రభుత్వ పాఠశాలల యూనిఫాంలకు కొత్త రూపు.. విద్యార్థులకు ఆకర్షణీయమైన డ్రెస్ కోడ్

ప్రతిపక్షం, జూన్ 13: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల యూనిఫాంలలో కీలక మార్పులు చేసింది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు పాఠశాలల ఆకర్షణను మెరుగుపరచే లక్ష్యంతో యూనిఫాం రంగులు, డిజైన్‌లను మార్చుతూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటివరకు అమల్లో ఉన్న మెరూన్, ఎరుపు-బూడిద రంగుల యూనిఫాంల స్థానంలో కొత్త రంగులను ప్రవేశపెట్టారు. తాజా నిర్ణయం ప్రకారం అబ్బాయిల షర్టులు, అమ్మాయిల టాప్స్ లైట్ బ్లూ రంగులో ఉండనున్నాయి. అలాగే అబ్బాయిల ప్యాంట్లు, బాలికల బాటమ్స్ ముదురు నీలం రంగులో రూపొందించనున్నారు. ఈ కొత్త యూనిఫాం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలులోకి రానుంది.

విద్యార్థులకు ఒకే విధమైన, సౌకర్యవంతమైన దుస్తులు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థుల అభిరుచులు, ఆధునిక విద్యా వాతావరణానికి అనుగుణంగా యూనిఫాం రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా ఆరో, ఏడో తరగతుల్లో చదువుతున్న అబ్బాయిలకు కూడా ప్యాంట్లు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కొన్ని పాఠశాలల్లో షార్ట్‌లను ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఇకపై అన్ని పాఠశాలల్లో ఒకే విధానం అమలు చేయనున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో సమానత్వ భావన పెంపొందడంతో పాటు క్రమశిక్షణ కూడా మెరుగుపడుతుందని విద్యాశాఖ అభిప్రాయపడుతోంది.

ప్రభుత్వ పాఠశాలలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ తరగతులు, ఇంగ్లీష్ మీడియం బోధన, ఉచిత అల్పాహారం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు యూనిఫాంలలో మార్పులతో మరో అడుగు ముందుకు వేసింది. కొత్త విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు ఈ కొత్త యూనిఫాంలతో పాఠశాలలకు హాజరుకానున్నారు.

Spread the love

Related News

Latest News