కామారెడ్డి కాంగ్రెస్‌లో గ్రూప్‌వార్.. క్రమశిక్షణ కమిటీ ముందుకు చంద్రశేఖర్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 11: కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి గాంధీభవన్‌కు చేరాయి. పార్టీ సీనియర్ నేతల మధ్య కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తన వివరణను సమర్పించారు. తనపై వచ్చిన ఆరోపణలకు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం.

కామారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆటంకాలు ఏర్పడటానికి కొందరు నాయకుల వ్యవహార శైలే కారణమని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించినట్లు తెలుస్తోంది. జిల్లాలో గత రెండు దశాబ్దాలుగా పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడానికి నాయకత్వ వైఫల్యాలే కారణమని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.

ఇటీవల జిల్లాలోని ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఒకరిపై ఒకరు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసుకోవడంతో వివాదం మరింత ముదిరింది. పార్టీకి నష్టం కలిగించే చర్యలు జరుగుతున్నాయంటూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయగా, చంద్రశేఖర్ రెడ్డి హాజరై తన వాదనలు వినిపించారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే అంశాలు, ఇటీవల వెలుగులోకి వచ్చిన వ్యాఖ్యలపై కూడా కమిటీకి వివరాలు అందించినట్లు తెలుస్తోంది.

కామారెడ్డి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఈ వర్గపోరు పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. స్థానికంగా పార్టీ ఐక్యత దెబ్బతింటోందన్న ఆందోళన వ్యక్తమవుతుండగా, ఈ వివాదానికి అధిష్ఠానం ఎలా తెరదించనుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Spread the love

Related News

Latest News