మహిళా పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. ఎఫ్‌ఎల్‌వోకు వెయ్యి గజాల స్థలం

ప్రతిపక్షం, జూలై 19: తెలంగాణలో మహిళా సాధికారతకు మరింత ఊతమిచ్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం ఎఫ్‌ఎల్‌వో ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం హైదరాబాద్‌లోని శిల్పారామం సమీపంలో వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన తెలిపారు.

ఎఫ్‌ఎల్‌వో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సీఎం వివరించారు. హైటెక్ సిటీ, సీఐఐ కార్యాలయాల మధ్య ఎఫ్‌ఎల్‌వో కార్యాలయం ఏర్పాటైతే ఆ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

అదే విధంగా ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలోనూ ఎఫ్‌ఎల్‌వో భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి కోరారు. ఫిక్కీ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు ఒక ఎకరం స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో ఫార్చూన్ 500 కంపెనీలను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఈ ప్రక్రియలో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర కీలకమని సీఎం అన్నారు.

మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మరిన్ని చర్యలు చేపడతామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎఫ్‌ఎల్‌వో ఆధ్వర్యంలో ఇప్పటికే విజయవంతమైన పారిశ్రామిక పార్కు ఉన్నందున, మహిళల కోసం మరో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

మహిళలు ఆర్థికంగా ఎదిగిన దేశాల్లో ఆర్థికాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయని సీఎం పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, వారి సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రత్యేక సమావేశం నిర్వహించి సమీక్షిస్తామని తెలిపారు.

వ్యాపార రంగంలో ప్రతిభ కనబరుస్తున్న మహిళా సంఘాలను గుర్తించి, ప్రతి ఏడాది ఎఫ్‌ఎల్‌వో ఆధ్వర్యంలో అవార్డులు అందించి గౌరవించాలని ముఖ్యమంత్రి సూచించారు. మహిళా సాధికారత, పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం-పరిశ్రమల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, ఎఫ్‌ఎల్‌వో జాతీయ అధ్యక్షురాలు పూజా గార్గ్, ఎఫ్‌ఎల్‌వో హైదరాబాద్ చైర్‌పర్సన్ సీతా రెడ్డి గడ్డం తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News