ప్రతిపక్షం, జూలై 08: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అందించే అల్పాహారం, మధ్యాహ్న భోజనం నాణ్యతను మెరుగుపరచాలంటే ఉపాధ్యాయులు కూడా అదే భోజనం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నాచారం ఐడీఏలో బాలామృతం నూతన ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా, పోషక విలువలతో ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి పాఠశాలల్లో భోజనం చేస్తే వంటకాల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, లోపాలు ఉంటే వెంటనే గుర్తించి సరిదిద్దే అవకాశం ఉంటుందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం, మెరుగైన విద్య అందించేందుకు కట్టుబడి ఉందని, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యమని తెలిపారు.
ఇటీవల ఉపాధ్యాయులకు పాఠశాలల్లో అల్పాహారం, భోజనం అందించే ప్రతిపాదనపై కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఎం చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను కొనసాగించే దిశగానే ఉన్నట్లు రాజకీయ, విద్యా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
















