ప్రతిపక్షం, జూలై 04: సిద్దిపేట జిల్లాలోని శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ను ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ సందర్శించారు. ఆస్పత్రిలో అందిస్తున్న ఉచిత వైద్య సేవలను పరిశీలించిన ఆయన, చిన్నారుల ప్రాణాలను కాపాడుతున్న వైద్య బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై ప్రశంసలు కురిపించారు.
తెలంగాణలో చిన్నారుల గుండె సంబంధిత వ్యాధులకు ప్రత్యేక వైద్య సేవల అవసరాన్ని గుర్తించి, అలాంటి సేవా సంస్థను ఏర్పాటు చేయడంలో హరీశ్ రావు చూపిన చొరవ అభినందనీయమని విజయ్ పేర్కొన్నారు. వేలాది కుటుంబాలకు ఆశాకిరణంగా మారిన ఈ ఆస్పత్రి రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు.
హరీశ్ రావును ఉద్దేశిస్తూ “సిద్దిపేట కా షేర్” అంటూ విజయ్ దేవరకొండ ప్రశంసించారు. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుని, సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడం నాయకత్వ లక్షణమని కొనియాడారు. ఈ ఆస్పత్రి ద్వారా ఎంతోమంది చిన్నారులు కొత్త జీవితం పొందుతున్నారని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
సత్యసాయి సంజీవని ఆస్పత్రి ఉచితంగా అందిస్తున్న గుండె శస్త్రచికిత్సలు, వైద్య సేవలు దేశవ్యాప్తంగా అనేక కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. సేవాభావంతో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది కృషి అమూల్యమని ఆయన అభినందించారు.
















