ప్రతిపక్షం, జూన్ 26: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని రంగారెడ్డి నగర్లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ భారతమాత ముద్దుబిడ్డ అని, ఆయన ధైర్యసాహసాలు, దేశభక్తి, పరిపాలనా దక్షత తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
అన్ని మతాలను సమానంగా గౌరవించిన మహనీయుడిగా శివాజీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. యోగా వంటి భారతీయ సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైందని వ్యాఖ్యానించారు.
భారతదేశం ప్రపంచానికి మార్గదర్శక దేశంగా ఎదుగుతోందని, దేశ సంస్కృతి, చరిత్ర, ఆధ్యాత్మికతకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెరుగుతోందని ఈటల రాజేందర్ అన్నారు. కుత్బుల్లాపూర్ ప్రాంతంలోని రహదారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ అభివృద్ధి కోసం ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాలను కోరుకుంటున్నారని, రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు ఆశిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
















