Trending Now

బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే.. మాజీ మంత్రి హరీష్ రావు

ప్రతిపక్షం, సిద్దిపేట ప్రతినిధి ఏప్రిల్ 12: బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటై కరీంనగర్, మెదక్, మల్కజ్ గిరి, సికింద్రాబాద్ తో పాటు మరికొన్ని చోట్ల బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్ లో మెదక్ పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని సిద్దిపేట పట్టణ బీఆర్ఎస్ కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. అబద్దాల్లో బీజేపీ బడేమియా అయితే.. కాంగ్రెస్ చోటేమియా అని, ఆరెండు పార్టీలు అబద్దాల్లో పోటీ పడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ లేకుండా చేయాలని బడే భాయ్ చోటే భాయ్ ఒక్కటయ్యారన్నారు. రేవంత్ రెడ్డి దగ్గర సరకులేదు.. పని లేదు.. అందుకే లీకులు ఫేకు వార్తలు కాలం గడుపుతున్నాయని అన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై అక్కసు వెల్లగక్కుడు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో లుకలుకలు స్టాట్ అయ్యాయని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి ప్రారంభమైందన్నారు. సిద్దిపేట వెటర్నరీ కాలేజీని కొడంగల్ కు తరలించుకొని పోయి రూ.150కోట్ల అభివృద్ధి పనులను ఆపిన కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు. కాంగ్రెస్ మీద కోపం కొద్ది బీజేపీకి ఓటు వేస్తే పరిస్థితి పేనం మీద నుంచి పొయిల పడ్డట్టయిందని, తెలంగాణ పరిస్థితి ఆగం అవుతుందనని హెచ్చరించారు.

పేదల, సంక్షేమ వ్యతిరేక పార్టీ, పదేళ్లుగా తెలంగాణకు సహకరించని పార్టీ బీజేపీ అన్నారు. సాగునీరు ప్రాజెక్టులను బాగు చేసుకొని వడ్లు పండించి కొనమంటే చేతులెత్తేసిన పార్టీ బీజేపీ అన్నారు. నూకలు బుక్కుమని ఉచిత సలహా ఇచ్చిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు పుట్లకొద్ది వడ్లు పండితే నేడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత పుట్టెడు దుఃఖం వచ్చిందన్నారు. బీజేపీ పదేళ్లలో పేదలకు ఏమి చేసిందో చెప్పకుండా రాముడి గుడి పేరిట రాజకీయం చేస్తున్నారన్నారు. ఉపఎన్నికల్లో అబద్దాలతో గెలిచి మాట తప్పిన రఘునందన్ రావుకు అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు బుద్ది చెప్పారని, దుబ్బాక లో చెల్లని రూపాయి మెదక్ లో ఎట్లా చెల్లుతుందని ఎద్దేవా చేశాడు. తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామ రక్ష అన్నారు. మెదక్ పార్లమెంట్ పై బీఆర్ఎస్ జెండా ఎగరేలా ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు తదితరలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News