- నది జలాలను అక్రమంగా తరలిస్తున్న ఎబిడి లిక్కర్ ఫ్యాక్టరీ
- ఫ్యాక్టరీ వ్యర్థాలతో కలుషితమవుతున్న కృష్ణానది నీరు
- ప్రాణ నష్టం, పంట నష్టం జరుగుతున్న మౌనం వహిస్తున్న అధికారులు
- అక్రమ నీటి తరలింపు ఇరిగేషన్ అధికారులకు కనిపించడం లేదా?
- నదీ జలాల అక్రమ తరలింపుపై గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేస్తాం
- బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్
ప్రతిపక్షం, జూన్ 06, వనపర్తి ప్రతినిధి: ఎబిడి లిక్కర్ ఫ్యాక్టరీ జల దోపిడీపై సమగ్ర విచారణ చేపట్టాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు.శనివారం పెబ్బేరు మండలంలోని రంగాపూర్ శివారులో గల ఎబిడి లిక్కర్ ఫ్యాక్టరీ సమీపంలోని కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా రాచాల మీడియాతో మాట్లాడుతూ…. ఎబిడి లిక్కర్ ఫ్యాక్టరీ అక్రమ నీటి వాడకంపై గత కొన్ని నెలలుగా బీసీ పొలిటికల్ జేఏసీకి ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు రావడం జరిగిందన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కృష్ణానది నీటిని అక్రమంగా వాడుకుంటున్నారని,అదేవిధంగా ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలను కృష్ణా నదిలో కలుపుతున్నట్లు కూడా మా దృష్టికి వచ్చిందన్నారు.వేసవికాలంలో కృష్ణానది నీరు అడుగంటి పోవడంతో వ్యవసాయానికి కూడా క్రాఫ్ హాలిడే ఇచ్చారని,అంతేకాకుండా ఇటీవల జరిగిన బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు సైతం తాగునీటికీ ప్రజలు అనేక తంటాలు పడ్డారని ఆయన గుర్తు చేశారు.ఇలాంటి సందర్భంలో నది పక్కనే ఉన్న లిక్కర్ ఫ్యాక్టరీ కృష్ణానది జలాలను స్టోరేజ్ చేసుకొని, 30HP, 40HP మోటార్లతో అక్రమంగా ఫ్యాక్టరీకి తోడేస్తున్నారని మండిపడ్డారు.నిబంధన ప్రకారం నదీ జలాలను మొదటగా తాగడానికి, సాగు చేసుకోవడానికి వాడుకోవాలని, తర్వాతనే ఇతర అవసరాల కోసం ప్రభుత్వ అనుమతులతో వాడుకోవాల్సి ఉంటుందన్నారు.నేడు ప్రజలు తాగునీటికీ, రైతులు వ్యవసాయానికి నీరు లేక అల్లాడుతున్నారని, లిక్కర్ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం దర్జాగా జలదోపిడి చేస్తుందని విమర్శించారు.పట్టపగలు ఇంత జలదోపిడి జరుగుతున్న ఇరిగేషన్ శాఖ అధికారులు ఎందుకోసం మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెంటనే స్పందించి కృష్ణానది జలాల అక్రమ తరలింపుపై సమగ్ర విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.ఫ్యాక్టరీ వ్యర్ధాలతో కలుషితమవుతున్న కృష్ణానది నీటి వల్ల జీవరాసులు సైతం మృతి చెందుతున్నాయని, ఈ సమస్యపై చెన్నై లోని గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసి జలదోపిడిని అడ్డుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో పొలిటికల్ జెఎసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, నాయకులు దేవర శివ, బత్తుల జితేందర్, రామన్ గౌడ్, బీచుపల్లి సర్పంచ్, బీసిరెడ్డి, ఉప సర్పంచ్ నాగరాజు, ఆదామ్, రాజశేఖర్ గౌడ్, వీరేష్, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.















